తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, యువత రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పం రోజురోజుకూ పెరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థాయిల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలని సమకాలీన చర్చ సాగుతోంది. అయినా, రాజకీయ పార్టీలు మాటల్లో ఎంత చెప్పినా, అమలులో మాత్రం యువతకు అవకాశం ఇచ్చే విషయంలో వెనుకడుగేసే దృక్పథం కనిపిస్తోంది.
ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికలు ఆ తరువాత జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పటికే చేరికల ప్రక్రియ ప్రారంభించింది. ఇతర పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టాయి.
గ్రామాల్లో యువ శక్తి
యువత గ్రామ స్థాయిలో సమస్యలపై గళమెత్తుతోంది. రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మారాలన్న ఆకాంక్ష బలపడుతోంది. కొంతమంది యువకులు అవకాశం రాకపోతే రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పార్టీ అభ్యర్థుల గెలుపు–ఓటమిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
యువత ఎదుర్కొంటున్న సవాళ్లు
ఆర్థిక సమస్యలు: ప్రచారం, ఓటర్ల ప్రభావితం కోసం భారీ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి యువతకు అడ్డంకిగా మారింది.
కుల ఆధిపత్యం: ఓటింగ్ తీరు కులపరంగా ఉండటం యువత సామర్థ్యాన్ని నిరోధిస్తోంది.
ప్రచారం లోపం: టీవీ, ముద్రిత మాధ్యమాలపై పార్టీల ఆధిపత్యం వల్ల యువతకు ప్రాచుర్యం దక్కడం కష్టంగా మారింది.
రాజకీయ పార్టీల వైఖరి
అన్ని ప్రధాన పార్టీలు యువతను ప్రోత్సహించాలన్న చెబుతున్నప్పటికీ, కనీస విద్యార్హతలు లేకున్నా, ఆర్థికంగా బలంగా ఉన్న పాత నాయకులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పార్టీలు మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల అవకాశం ఇచ్చి యువతను ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నాయి అనే వాదన బలంగా వినిపిస్తోంది.
ప్రచార ఆయుధాలుగా ప్రభుత్వ వైఫల్యాలు
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పాలన వైఫల్యాలను తమ ప్రచార ఆయుధాలుగా మలుచుకుంటున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం తమ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇతర పథకాలు అమలు చేశామని చెప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్ల అయోమయం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రకటన ఉన్నా, వాటి అమలుపై స్పష్టత, చిత్తశుద్ధి కనిపించడం లేదు. తాజా పరిణామాలను గమనిస్తే, కోర్టు ఆదేశాల ప్రకారం దీనిపై త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రజల మైండ్సెట్ మార్పు
ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలకు అలవాటు చేసిన ప్రలోభాలు ఇప్పుడు కొంతమేరకు ప్రభావం కోల్పోతున్నాయి. గ్రామస్తులు “డబ్బు ఇస్తే ఓటు వేయాలి” అనే దశ నుంచి “మా పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు పనిచేస్తారు?” అనే దశకు వస్తున్నారు. యువత యొక్క నిస్వార్థత, ప్రజల చెంత ఉండే తీరు ఓటర్లను ఆకర్షించడంలో కొంత మేరకు విజయవంతమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. యువతను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, వాస్తవంలో అవకాశం ఇవ్వాల్సిన అవసరం మరింత పెరిగింది. రాజకీయాల్లో నూతన బితరం ప్రవేశించాలంటే యువతకు మార్గం సుగమం చేయాలి. ఇది ఒక ఎన్నిక కోసం మాత్రమే కాదు, ఓ తరం భవిష్యత్తు కోసం పోరాటం.
https://ceotelangana.nic.in/About.HTML
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
Telangana Panchayat Elections 2025: Congress, BRS, BJP Brace for Triangular Political Battle
Panchayat Elections 2025: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు

