ప్రత్యేక కథనం – ప్రతిపక్షం టీవీ:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ, వారిని తీవ్రంగా అవమానించారు. “ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ, తిట్లు తిడుతూ, అసభ్యంగా మాట్లాడేవాడు ‘జర్నలిస్ట్’ అనే ముసుగుతో సోషల్ మీడియాలో అందరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆ యూట్యూబ్ జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని, వాళ్లను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.. సీఎం వ్యాఖ్యలపై పలువురు జర్నలిస్టులు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక, అధికారిక సమావేశాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను ఉద్దేశించి, “మీరే చెప్పండి, ఎవరు పాత్రికేయులు?” అని ప్రశ్నించారు. ఇది ఒక అసాధారణమైన, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసే ప్రశ్న. అయితే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే వారిని ఎవరు కూడా సమర్ధించరూ ,కానీ ఇది ఒక్క యూట్యూబ్ జర్నలిస్ట్ లే ఈ పదజాలాన్ని వాడుతున్నారా? అయితే ప్రధాన మీడియాలు విలువలు పాటిస్తున్నారా? మరి ప్రజాప్రతినిధుల ఉపయోగిస్తున్న భాష సంగతేంటి?
భారతదేశంలో:
• అడ్వకేట్ కావాలంటే Bar Council నమోదు తప్పనిసరి
• డాక్టర్ కావాలంటే NMC / MCI గుర్తింపు అవసరం
• కానీ పాత్రికేయుడికి ఇలాంటివే ఎలాంటి లైసెన్సింగ్ మెకానిజం లేదు.
ఇది ఉద్దేశపూర్వకంగా — ఎందుకంటే పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు అనే సిద్ధాంతంతో రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా రూపొందించారు.
ప్రపంచస్థాయి జర్నలిజం మార్పులు – స్వతంత్ర వేదికల విలువ:
• ప్రపంచం మొత్తం మీద చూస్తే, స్వతంత్రంగా పని చేస్తున్న పాత్రికేయులే మీడియా రంగానికి కొత్త దారి చూపుతున్నారు. డిజిటల్ జర్నలిజం, సిటిజన్ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, రిపోర్టింగ్ అడ్వకసీ, RTI జర్నలిజం వంటి మార్గాలు ప్రజాస్వామ్య హక్కుల కోసం సమర్థంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం గౌరవప్రదంగా స్వీకరించబడుతున్నాయి. వేదిక మారినా, జర్నలిజం విలువలు — నిజం, బాధ్యత, సమగ్ర విశ్లేషణ — మారవు.
MAJMC వంటి విద్యార్హతలు — జర్నలిజానికి బలమైన భవిష్యత్తు:
• ప్రస్తుతం అనేకమంది యువ జర్నలిస్టులు MAJMC (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ) అర్హతతో, పూర్తి స్థాయిలో జర్నలిజం విద్యను అధ్యయనం చేసి, బాధ్యతతో సమాచారాన్ని సమాజానికి అందిస్తున్నారు. వీరిలో చాలామంది యూట్యూబ్, వెబ్సైట్, సోషల్ మీడియా వేదికలపై పనిచేస్తున్నారు. వారు చట్టబద్ధమైన, అధ్యయనాత్మక, బాధ్యతాయుతమైన పాత్రికేయంగా ఎదుగుతున్నారు
• ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి MAJMC పూర్తి చేశారు.
• జర్నలిజం రంగంలో అంతర్జాతీయంగా అంగీకరించిన విద్యార్హత.
• ఈ విద్యతో సమాచారం సేకరణ, విలువైన విశ్లేషణ, నైతిక విలువలపై బోధన కలుగుతుంది.
జర్నలిజం అంటే కేవలం ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేయడమేమీ కాదు, నిజం మాట్లాడే ధైర్యం, ప్రజలకు వాస్తవాలను అందించే బాధ్యత ఉంటే చాలు — ఆ వ్యక్తి పాత్రికేయుడు.
ఇప్పుడు టీవీ, ప్రింట్ కాదు — డిజిటల్ మీడియా ప్రధాన వేదికగా మారింది. ఈ వేదికల్ని ఉపయోగించి జర్నలిస్టులు:
• రైతుల సమస్యలు,
• ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలు,
• న్యాయ పోరాటాలు,
• ప్రజా ప్రయోజనాల కోసం రిపోర్టింగ్ చేస్తున్నారు. అయితే వేదిక ఆధారంగా జర్నలిజాన్ని నిర్ణయించడం అన్యాయం.
• టీవీ ఛానల్లో పనిచేస్తే పాత్రికేయుడు…
యూట్యూబ్‌లో రిపోర్ట్ చేస్తే అర్హతలేని వ్యక్తి అనడం అన్యాయం!
• వేదిక కాదు విలువ ముఖ్యం. జర్నలిస్టు ఎవరో నిర్ణయించేది వారి రిపోర్టింగ్ గాఢత, ప్రజల ప్రయోజనానికి తానేంటో చూపే విధానం ఆధారంగా.
పత్రికా విలేకరులపై నిర్ణయం ఎవరికి అధికారం?
భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛలు, మాటల స్వేచ్ఛ (Article 19(1)(a)) ప్రకారం — ఎవరి పనితీరు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే, వారు పాత్రికేయులే. ఎవరైనా ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఒక వ్యక్తిని పాత్రికేయుడిగా గుర్తించాలా, వద్దా అని నిర్ణయించడానికి నేరుగా ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేదు.
PIB లేదా అక్రిడిటేషన్ కార్డులు ఏమిటి?
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) మరియు రాష్ట్ర సమాచార శాఖలు కొంత మంది జర్నలిస్ట్ లకు ప్రభుత్వ ఆధారిత కార్డులు ఇస్తాయి. అయితే ఇవి కేవలం:
• ప్రభుత్వ సమావేశాల్లో ప్రవేశానికి,
• మీడియా కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించడానికి,
• సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం మాత్రమే.
• PIB కార్డు ఉన్నా లేకపోయినా, జర్నలిస్టుగా పని చేయడం సహజ హక్కు ,ఈ కార్డులు పాత్రికేయ హోదాకి ప్రమాణంగా పరిగణించలేవు.
అసభ్య భాష, నైతికతలు – ఎవరు సమీక్షించాలి?
ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసభ్య భాష వినిపిస్తున్నదీ నిజమే. కానీ, అదే తరహాలో — రాజకీయ నాయకులు కూడా బహిరంగ సభల్లో తిడుతూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడుతున్న వారు ఎందరో ..వారిలో చాలా మందికి కనీస విద్యార్హతలు లేవు. సమాజంలో జర్నలిస్టులపై నైతికతను మోపే ముందు, రాజకీయ నాయకులు తమ మాటలు, భాషను పర్యవేక్షించాలి. పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై బూతులు, వ్యక్తిగత విమర్శలు చేసే నాయకుల నుంచి నైతికత పాఠాలు జర్నలిస్ట్ లకు అవసరమా? అనే ప్రశ్న వేయడం అవసరం. జర్నలిస్టులపై నైతికతను మోపాలంటే, అదే ప్రమాణాలు రాజకీయ నాయకులపై కూడా వర్తించాలి. రాజకీయ నాయకులు తమ విమర్శల్ని పరిశీలించుకోవాలి — వారు పాత్రికేయులకు లెక్చర్ ఇవ్వగల హక్కుదారులు కావు.
పాత్రికేయునికి మాత్రం నైతికతలపై క్లాస్ తీసుకోవాలా?
ఇది ద్వంద్వ నైతికత. నైతికత అనేది విలువల విషయమే అయినా, అది ప్రజల అభిప్రాయం ఆధారంగా తేలుతుంది, సినిమా సెన్సార్ బోర్డు తరహాలో ఒక అధికారికి నిర్ణయించే అవకాశం లేదు. అసభ్య భాష వాడడం — వ్యక్తిగత ఆచరణ సమస్య, వృత్తిపరమైన అర్హత కాదు, ఏవైనా వేదికలపై అసభ్య భాష వాడటం తప్పే. అలాగే, కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యతిరేకంగా అసభ్యతను ప్రస్తావించడం వేరు, అయితే దాన్ని కారణంగా చూపించి జర్నలిస్టులను ఇష్టానుసారం మాట్లాడం సరైంది కాదు.
జర్నలిస్టు అనేది ఉద్యోగం కాదు — అది ప్రజాస్వామ్యపు బాధ్యత: అది ఏ మాధ్యమం అనేది కాదు, విలువలు ముఖ్యం!

MAJMC| Independent Journalist | RTI Activist