తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల దోపిడి వాస్తవాలు — ప్రతిపక్షం టీవీ స్పెషల్ రిపోర్ట్
సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తిపరమైన కోర్సు ఏది అంటే వెంటనే గుర్తొచ్చేవి మెడిసిన్, ఇంజినీరింగ్, న్యాయవాద వృత్తి. ఈ మూడు కోర్సులు ప్రతిష్టాత్మకమైనవిగా భావించబడ్డాయి. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉన్నత ఉద్యోగస్థులైనా, డాక్టర్లు, ఇంజినీర్లు అయినా కూడా, “న్యాయ విద్య” అంటే ఆసక్తి పెరుగుతోంది. ప్రజలలో న్యాయ అవగాహన పెరగడం, లీగల్ ఫీల్డ్‌లో అవకాశాలు విస్తరించడం వల్ల ఎల్.ఎల్.బి (Lawcet ) కోర్సులపై డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.
ఎల్.ఎల్.బి కోర్సుల డిమాండ్, సీట్లు పరిమితులు:
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు రకాల ఎల్.ఎల్.బి (Lawcet ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి
1. మూడు సంవత్సరాల ఎల్.ఎల్.బి (3 Years LL.B) – డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
2. ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి (5 Years Integrated LL.B) – ఇంటర్మీడియట్ తర్వాత చదవవచ్చు.
ప్రతీ సంవత్సరం రెండు కోర్సులకు కలిపి దాదాపు 50,000 వరకు విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ లా కాలేజీల్లో మొత్తం సీట్లు 7,000 వరకు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కన్వీనర్ కోటా సీట్లు పరిమితంగా ఉండటంతో, వేలాది మంది విద్యార్థులు మేనేజ్మెంట్ కోటా వైపు మొగ్గుతున్నారు.
మేనేజ్మెంట్ కోటా ఫీజులు — విద్యార్థుల కళ్లెదుటే దోపిడి
ప్రతిపక్షం టీవీ హైదరాబాద్ నగరంలో ఉన్న సుమారు 8 లా కాలేజీలను సందర్శించి మేనేజ్మెంట్ కోటా పరిస్థితిని తెలుసుకుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. కేశవ్ మెమోరియల్ లా కాలేజ్, అంబేద్కర్ లా కాలేజ్, పెండేకంటి లా కాలేజ్, కె.వి రంగారెడ్డి లా కాలేజ్ లు మేనేజ్మెంట్ కోట సీట్లు లేవు అని తెలిపారు. ఇక పొనుగంటి మాధవరావు లా కాలేజ్ ఐదు సంవత్సరాల ఎల్ఎల్బి కి రెండు విడతల్లో నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఇక మహాత్మా గాంధీ లా కాలేజీలో 5 సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్స్ ఫీజు నాలుగు లక్షల రూపాయలు అని కాలేజీ సిబ్బంది స్పష్టంగా తెలిపారు. అంతేకాదు, ఈ నాలుగు లక్షల రూపాయలను ఒకే విడతలో చెల్లించాల్సిందే అని కండిషన్ కూడా పెట్టారు.
విద్యార్థులు దీన్ని వినగానే ఆశ్చర్యంతో వెను తిరిగిపోయారు. “ఐదు సంవత్సరాల కోర్సు కోసం ఒకేసారి డబ్బు చెల్లించడం మా తల్లిదండ్రులకు అసాధ్యం” అని విద్యార్థులు వాపోయారు.
ప్రతీ ఏడాది ఫీజు చెల్లించాలనే విజ్ఞప్తికి కూడా నిరాకరణ
కొంతమంది విద్యార్థులు, “సరే 4 లక్షల ఫీజు అయినా సరే, కానీ ప్రతి సంవత్సరం ఫీజును విడిగా చెల్లిస్తాం” అని విజ్ఞప్తి చేశారు. అయితే, కాలేజీ యాజమాన్యం “అలా కుదరదు, ఒకేసారి చెల్లించాలి” అని తెగేసి చెప్పింది.
మేనేజ్మెంట్ కోటా అంటే స్వేచ్ఛా దోపిడి కోటా?
సాధారణంగా మేనేజ్మెంట్ కోటా సీట్లు కాలేజీ మొత్తం సీట్లలో 25% వరకు ఉంటాయి. ఈ సీట్లపై కాలేజీలకే పూర్తి అధికారం ఉండటంతో, తమ ఇష్టం వచ్చిన ఫీజులు నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగింది. కన్వీనర్ (Lawcet ) కోటాలో ప్రభుత్వ ఫీజు సంవత్సరానికి ₹20,000 – ₹42,000 మధ్య ఉంటే, అదే సీటు మేనేజ్మెంట్ కోటాలో సంవత్సరానికి 1 లక్ష నుండి 3 లక్షల రూపాయల వరకు అమ్ముడవుతోంది.
ఇకపై, కొందరు విద్యార్థులు చెబుతున్న అంశం మరింత షాకింగ్‌గా ఉంది — “పోలిటికల్ లీడర్లు, పెద్ద అధికారులు సిఫారసు చేస్తేనే మేనేజ్మెంట్ సీటు ఇస్తారు” అని. ఈ వ్యవస్థ దాదాపు రాష్ట్రవ్యాప్తంగా సేమ్‌గా కొనసాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
విద్యార్థుల నిరాశ — కలల కోర్సు మున్ముందు కలగానే మిగిలిపోతుందా?
ఎల్.ఎల్.బి కోర్సు చదివి న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టాలని కలలు కంటున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు నిరాశలో మునిగిపోయారు. కొందరు తరువాతి సంవత్సరానికి Lawcet సిద్ధం కావాలని నిర్ణయించుకుంటుండగా, మరికొందరు ఫీజులు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక విద్యార్థి మాటల్లో — “ప్రభుత్వ సీటు రాలేదు, మేనేజ్మెంట్ కోటా ద్వారా అయినా చదవాలని వచ్చాం. కానీ ఇంత భారీ ఫీజు విన్నాక మళ్లీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మా కుటుంబం మధ్యతరగతి. ఇలా ఉంటే న్యాయ విద్య పేదలకు దూరమవుతుంది.”
కాలేజీల వాదన — ప్రభుత్వ ఫీజులు తగవు
కాలేజీ యాజమాన్యాలు మాత్రం వేరే కోణం చెబుతున్నాయి. “ప్రభుత్వం నిర్ణయించే ఫీజు తక్కువగా ఉంది. బోధన, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఫెసిలిటీస్ నిర్వహణ ఖర్చులు ఎక్కువ. అందుకే మేనేజ్మెంట్ కోటా ఫీజు పెంచాల్సి వస్తోంది” అని వారు వాదిస్తున్నారు.
కానీ ఈ వాదనకు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. “అంతేనా అయితే కనీసం విడతల వారీగా తీసుకోవాలి కదా” అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం జోక్యం అవసరం
ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒకే మాట చెబుతున్నారు —
> “ప్రభుత్వం కన్వీనర్ (Lawcet ) కోటా సీట్లు పెంచాలి. మేనేజ్మెంట్ కోటా ఫీజులకు గరిష్ట పరిమితి నిర్ణయించాలి.”
ప్రస్తుతం ఎల్.ఎల్.బి కోర్సులు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయనే పరిస్థితి ఏర్పడింది. ఇది సమాన విద్య హక్కుకు విరుద్ధం. లా విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలంటే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన పాలసీ రూపొందించాల్సిన అవసరం ఉంది.
విద్యార్థుల సూచనలు మరియు ప్రతిపక్షం టీవీ విశ్లేషణ:
1. మేనేజ్మెంట్ కోటా ఫీజులపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి.
2. ప్రభుత్వ లా కాలేజీల సీట్లు 50% పెంచాలి.
3. సీట్లు విక్రయానికి సంబంధించి ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టాలి.
4. తక్కువ ఆదాయం కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలి.
ప్రతిపక్షం టీవీ విశ్లేషణ ప్రకారం, విద్యా రంగం పూర్తిగా కమర్షియల్ అవుతోంది. ప్రత్యేకంగా న్యాయ విద్యా రంగం అంటే సమాజ న్యాయం, చట్ట అవగాహనకు నడిపించే శక్తి. కానీ ఈ ఫీజు వ్యవస్థ వల్ల ఆ న్యాయం కేవలం ధనవంతులకు మాత్రమే చేరే విద్యగా మారిపోతోంది.
ముగింపు:
న్యాయ విద్య అంటే కేవలం ఒక డిగ్రీ కాదు — అది ప్రజలకు న్యాయం అందించే సామాజిక బాధ్యత. అలాంటి విద్యను వాణిజ్య వస్తువుగా మార్చడం చాలా ప్రమాదకరం. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజు దోపిడి విద్యార్థుల కలలను చంపేస్తోంది. అందుకే విద్యార్థులు ఒకే విజ్ఞప్తి చేస్తున్నారు —“ప్రభుత్వం జోక్యం చేసుకుని మా న్యాయ విద్యను కాపాడండి. మేము కూడా న్యాయం నేర్చుకుని సమాజానికి న్యాయం చేయాలనుకుంటున్నాం.”
https://lawcet.tgche.ac.in/
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE :
TG LAWCET 2025 స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం – LL.B ఖాళీ సీట్ల భర్తీ ప్రకటన విడుదల
TG LAWCET: Second Phase Counselling Notification

