వైఎస్సార్సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. డిసెంబర్ 28 పార్టీలో చేరిన రాయుడు 10 రోజుల తిరక్కుండానే సంచలన ట్వీట్ చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, క్రికెట్ అభిమానుల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు గత కొంత కాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనబరిచారు.వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్కు మద్దతుగా పలుమార్లు ట్వీట్స్ కూడా చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం వల్ల వైసీపీ బలపడుతుందని భావించింది అనుకున్నట్లుగానే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక సీఎం జగన్ను కలిసిన రాయుడు పలు సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28 న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడం వెనుక అర్థం ఏంటి.. వైసిపి అధిష్టానం నుండి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన హామీ లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..దీంతో వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో రాయుడు ఉన్నారా..కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో జనసేనలోకి వెళ్తారా… ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.