“రుణమాఫీ”.. దీని ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు అనేక పార్టీలు ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ హామీ తోనే అధికారంలోకి వచ్చి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో 2023లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ హామీనీ నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు.అయితే ఎన్నికల సమయంలోనే కాదు ఇప్పుడు కూడా దీని చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి.
తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నాము. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉంది. రుణమాఫీ అమలు ఎప్పుడు చేస్తారో కాదు కదా అసలు ఇప్పటివరకు దానిపై ఒక స్పష్టతకు కూడా రానట్లే కనిపిస్తుంది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే.. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడవక ముందే టిఆర్ఎస్ పార్టీ వాళ్లు నిలదీయడమేంటని, రుణమాఫీ అమలుపై చిత్తశుద్ధితో ఉన్నామని దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని అధికార పక్షం నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇది కాంగ్రెస్,టిఆర్ఎస్ మధ్య లొల్లి ఇంతవరకు బాగానే ఉంది. కానీ బ్యాంకులు రైతులనుండి బకాయిలు రాబట్టే పనిలో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే..20 జనవరి 2024న ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల బ్రాంచ్ మేనేజర్ రుణగ్రహీతకు లీగల్ నోటీస్ పంపించారు.మీరు వ్యవసాయ సాగు నిమిత్తం మా బ్యాంకు నుండి రుణము పొందారు. వాటికి ఈరోజు వరకు మీరు చెల్లించాల్సిన డబ్బు మిత్తితో కలిపి నోటీసు ముట్టిన వారం రోజుల్లోపు చెల్లించాలని లేనియెడల మీకు సంబంధించిన స్థిర,చర ఆస్తులను జప్తు చేసి వేలం వేయుటకు తగు చర్యలు తీసుకోబడునని రుణ గ్రహీతకు తెలిపారు. అంతేకాదు సదరు రుణం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇవ్వబడిందని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ గారికి నివేదించి మీ పేరును బ్లాక్ లిస్టులో వేయాల్సిందిగా కోరతామని తెలిపారు. బ్లాక్ లిస్టులో ఉన్న వారికి సబ్సిడీ,రేషన్,ప్రభుత్వ పెన్షన్ నిలిపివేయబడునని అలాగే బ్యాంకు లావాదేవీలు కూడా నిలిపివేయుటకు చర్యలు తీసుకోబడునని లీగల్ నోటీస్ లో తెలిపారు.