ప్రముఖ వ్యాపారవేత్త,రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ‘స్వయంకృషి’తో సాధించుకున్న మిత్రులు చిరంజీవి గారిని భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన చిరంజీవి గారు తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా సామాజిక సేవా రంగంలో చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో మరెందరికో ఆదర్శంగా నిలిచాయి. అయోధ్య బాల రామయ్య ను దర్శించుకున్న మూడు రోజుల్లోనే ఈ పురస్కారం రావడం విశేషం. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అన్నారు.