డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ భూముల్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ యూనివర్సిటీ అందరికీ విద్య అనే నినాదంతో..రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించింది.ఇది రాళ్లు ,రప్పలు ,కొండల మీద ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా ఉన్న భూమిలో కొంత జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి కేటాయిస్తే అంబేద్కర్ యూనివర్సిటీకి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత విస్తరించడానికి అవకాశం లేకుండా పోతుందని ఉద్యోగులందరూ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం మాట్లాడుతూ..ఈ భూమి కేటాయింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని లేని యెడల అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులందరం కలసి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు వివిధ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారని వారికి ఈ యూనివర్సిటీ పట్ల ప్రేమ ఉంటుందని వారందరూ ఈ ఉద్యమంలో పాల్గొంటారని అభిప్రాయపడ్డారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారని ఈ యూనివర్సిటీని కాపాడుకోవడానికి అందరూ కలిసి ముందుకు వెళ్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రో.ఎల్ వి కె రెడ్డి, పిఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి ,ప్రొఫెసర్ యాదగిరి కంభంపాటి , ఇతర ప్రొఫెసర్లు ,ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.