వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం అందించింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గార్లను సంస్థ ప్రతినిధులు కలిసి విరాళం చెక్కును అందజేశారు.
సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన వారిలో అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డి , డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐఎస్ఆర్ రావు తదితరులు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో అరబిందో ఫార్మా సంస్థ చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.