హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ డీఎస్పీ, ఆధ్యాత్మిక వేత్త, యజ్ఞ బ్రహ్మగా గుర్తింపు పొందిన నళిని, తన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తెలుగు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. “ఇది నా వీలునామా/మరణ వాంగ్మూలం” అంటూ ఆ లేఖను ప్రారంభించారు. నళిని తన లేఖలో, గత ఎనిమిదేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో పోరాడుతున్నానని, ఇటీవల డెంగ్యూ, చికెన్‌గున్యా, టైఫాయిడ్‌ల కారణంగా పరిస్థితి మరింత క్షీణించిందని పేర్కొన్నారు. రాత్రిపూట నిద్ర పట్టక, మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నానని తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!తన గత జీవితం గురించి ప్రస్తావిస్తూ – ఉద్యమకారిణిగా, అధికారిణిగా, రాజకీయవేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా ఎన్నో
కష్టాలు ఎదుర్కొన్నానని, 12 ఏళ్ల అజ్ఞాతవాసం అనుభవించానని రాశారు. ఆ సమయంలో మహర్షి దయానంద ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొన్నానని, VYPS (వేద యజ్ఞ పరిరక్షణ సమితి) సంస్థను స్థాపించానని తెలిపారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర దశలో ఉందని, సరైన వైద్యం అందకపోతే బ్రతకడం కష్టమని పేర్కొన్నారు. “నా స్థితి కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితేనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడగలను” అని విజ్ఞప్తి చేశారు. మరణానంతరం తన అంతిమ సంస్కారాలు వైదిక పద్ధతిలో జరగాలని, తనను “సస్పెండెడ్ ఆఫీసర్”గా కాకుండా “రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ”గా గుర్తించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఉన్న స్థలాన్ని VYPS ట్రస్ట్‌కు అంకితం చేస్తున్నానని, తన ఆశయాలను కొనసాగించేందుకు వేదామృతం ట్రస్ట్‌కు సహాయం చేయాలని ప్రధాన మంత్రిని కోరారు.
“బ్రతికుండగా నన్ను పట్టించుకోని వారు, నేను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు” అని రాష్ట్ర నాయకులను ఉద్దేశించి గాఢమైన వ్యాఖ్యలు చేశారు.