న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులే ఇప్పుడు భూమి కబ్జా దందాకు బలవుతున్నారు. వరంగల్ నగర సమీపంలోని కడిపికొండలో ఉన్న అడ్వకేట్ కాలనీలో పార్క్ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు తెగబడిన ఘటన కలకలం రేపుతోంది.
ఇది కేవలం ఏదైనా సాధారణ నివాస ప్రాంతం కాదు. 2009లో 210 మంది న్యాయవాదులు కలిసి కడిపికొండలోని రైతుల నుంచి సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించారు. గత 15 ఏళ్లుగా ఎటువంటి వివాదాలు లేకుండా శాంతిగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలనీలో, తాజాగా పబ్లిక్ పార్క్‌గా కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు అనుమానితులు ప్రయత్నించడంతో న్యాయవాదులు బుధవారం పెద్ద సంఖ్యలో సమావేశమై, పార్కు స్థలాన్ని పరిశీలించి చదును చేయించారు. “ఈ భూమి మాకు చట్టబద్ధంగా చెందినది. పార్కు స్థలంపై ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించం,” అని సొసైటీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి నీల శ్రీధర్ రావుతో కలిసి సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులం అయిన మా స్థలాలకే రక్షణ లేకుంటే, సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సొసైటీలో జడ్జీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ సొసైటీ సభ్యుల స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.