రాజకీయాల్లో వాగ్దానాలు, మాటలు సాధారణమే. కానీ రైతు సమస్యల విషయానికి వస్తే ప్రతి నాయకుడి నిజస్వరూపం బయటపడుతుంది. ప్రస్తుతం కరేడు రైతుల సమస్యపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ రాసిన లేఖలో రైతుల సమస్యల పై స్పందించారు.
బలవంతపు భూసేకరణ అనే పదమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎవరైనా అంగీకరించకమానరు. రైతు పుట్టిన భూమి అతని ఆస్తి మాత్రమే కాదు, అతని ప్రాణం. అలాంటి భూములను “అభివృద్ధి” పేరిట బలవంతంగా లాక్కోవడం ఏ రూపంలోనూ సమర్థనీయం కాదు. ముఖ్యంగా రైతులు తమ సమస్యను వినిపించుకునేందుకు ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడడం ప్రభుత్వ చిత్తశుద్ధి మరియు వ్యవస్థలో ఉన్న లోపాలను బట్టబయలు చేస్తోంది.
రామచంద్రయాదవ్ లేఖలో కొన్ని కీలక ప్రశ్నలు ఉన్నాయి. జగన్ బినామీగా ముద్ర వేసిన సంస్థకే చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు ఇవ్వడం ఏ నైతికత? రైతులు వీధుల్లో పోరాడుతుంటే, వారిపై కేసులు మోపడం ఏ ప్రజాస్వామ్య పద్ధతి? ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కాదు; ప్రజాస్వామ్యపు ప్రాణాధారమైన రైతుల భవిష్యత్తుతో ఆడుకోవడమే అనే విషయం స్పష్టం అవుతుంది.
ఇలాంటి సమస్యలపై పరిష్కారం కోసం విన్నవించడానికి సీఎం “అపాయింట్మెంట్” ఇవ్వడానికి కూడా వెనుకాడడం మరింత దారుణం. ప్రజా సమస్యలను విన్నవించుకోవడానికి “సమయం” కేటాయించని ప్రభుత్వం, ప్రజల విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? ఇదే ప్రశ్న రామచంద్రయాదవ్ తన లేఖలో గుర్తు చేశారు.
రాజకీయ చరిత్రలో చాలాసార్లు చూశాం—రైతు ఉద్యమాలు చిన్న చినుకులా మొదలై, పెద్ద వరదలా మారాయి. కరేడు భూసేకరణపై రామచంద్రయాదవ్ ఇచ్చిన హెచ్చరిక కూడా అలాంటి సంకేతమే. ఆయన నిరాహార దీక్షకు దిగితే, అది ఒక్క ప్రాంతం సమస్యగానే ఉండదు; రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం ఒక పెద్ద ఉద్యమానికి రూపం దాల్చే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే, రైతు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కావాలి. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి, కరేడు రైతులకు న్యాయం చేయలసిన అవసరం ఉంది. లేనిపక్షంలో, ఈ పోరాటం రాజకీయ రంగాన్ని కదిలించే అవకాశమే ఎక్కువ.