శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ విషాదానికి దారితీసింది. క్యూలైన్ గందరగోళంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రజాప్రతినిధులు, బాధితులకు ప్రభుత్వ సహాయం అందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. గాయపడిన వారికి అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఇప్పటికే సంబంధిత ఆసుపత్రులకు ఆదేశించారు.
ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కార్తీక మాసం నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా శైవ ఆలయాలు, ప్రముఖ దేవాలయాల్లో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేవాదాయ శాఖ, పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
భక్తుల రద్దీ అంచనా వచ్చినప్పుడు ముందస్తు పథకాలు రూపొందించి, క్యూలైన్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు భద్రతా ఏర్పాటు చేసి, అవసరమైనచోట పోలీస్ బందోబస్తు మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై కేంద్ర-రాష్ట్ర స్థాయి పలువురు ప్రముఖ నాయకులు స్పందించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలు నేతలు బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.”
https://srikakulam.ap.gov.in/
By Veeramusti Sathish, M.A.(JMC), M.A.(Pol.Sc) – Journalist & RTI Activist (Founder – PrathipakshamTV)
READ MORE:

