భారతదేశ యువతలో నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు, పనిలో అనుభవం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. అటువంటి ప్రధాన కార్యక్రమాల్లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా యువతకు దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం శిక్షణ మాత్రమే కాదు, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాల దిశగా మార్గదర్శకంగా కూడా ఉపయోగపడే పథకం అని చెప్పవచ్చు .
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం అంటే ఏమిటి?
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం యువతకు పనిచేసే అనుభవాన్ని అందించడంతో పాటు, ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన ఒక శిక్షణాత్మక కార్యక్రమం. ఈ పథకంలో యువతను ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగంలోని ప్రముఖ సంస్థలలో ఇంటర్న్‌లుగా ఎంపిక చేసి ప్రత్యక్షంగా పనిలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
ఈ పథకం లక్ష్యం విద్యార్థుల నుంచి ఉద్యోగులుగా మారే ప్రయాణంలో ఉన్న అడ్డంకులను తొలగించడం. చదువు పూర్తిచేసిన అనేక మంది యువతకు అనుభవం లేకపోవడం వల్ల ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. అలాంటి వారికి ఈ పథకం వృత్తి అనుభవం అందిస్తుంది.
పథక ముఖ్య లక్ష్యాలు:
యువతలో ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం
పని నైపుణ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు అందించడం
పరిశ్రమ అవసరాలకు తగిన శిక్షణ ఇవ్వడం
గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగాలకు మార్గం చూపడం
స్వయం ఉపాధికి దారితీసే ప్రాయోగిక అవగాహన కల్పించడం
స్టైపెండ్ :
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా భృతి చెల్లించబడుతుంది. ఇది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం చేస్తుంది.
| వివరాలు | మొత్తం |
|---|---|
| నెలవారీ భృతి | ₹5,000/- |
| ఇందులో ప్రభుత్వ భాగం | ₹4,000/- |
| భాగస్వామ్య సంస్థ సహాయం | ₹500/- |
| చేరినప్పుడు ప్రత్యేక ఆర్థిక సహాయం | ₹6,000 (ఒకసారి మాత్రమే) |
| మొత్తం లాభం | ₹36,000–₹66,000 (శిక్షణ వ్యవధిపై ఆధారపడి) |
అన్ని చెల్లింపులు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ – DBT) ద్వారా నేరుగా లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాకే పంపబడతాయి.
బీమా సౌకర్యం:
ఈ పథకంలో పాల్గొనే ప్రతి ఇంటర్న్‌కు ప్రభుత్వం ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాని సురక్షా బీమా యోజన ద్వారా బీమా రక్షణ కల్పిస్తుంది. అదనంగా, కొన్ని భాగస్వామ్య సంస్థలు అదనపు ప్రమాద బీమా సౌకర్యం కూడా అందించే అవకాశం ఉంది.
పాఠశాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా?
ఈ పథకం 10వ తరగతి పూర్తిచేసిన వారికి కూడా అందుబాటులో ఉంది. కనీస అర్హతలు కలిగిన వారు ఎవరికైనా అవకాశం ఉంటుంది. అనగా గ్రామీణ ప్రాంతాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు ఇది మంచి అవకాశం.
అర్హత ప్రమాణాలు:
పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కింది అర్హతలు కావాలి:
అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి
వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి
విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ (BA, BSc, BCom, BBA, BCA మొదలైనవి)
పూర్తి స్థాయి ఉద్యోగంలో లేదా సాధారణ విద్యలో చేర్పు ఉండకూడదు
ఏటా కుటుంబ ఆదాయం ₹8 లక్షలలోపు ఉండాలి
దూర విద్య (Distance Education) చదువుతున్నవారు కూడా అర్హులు
వీరు అనర్హులు:
ఈ పథకానికి క్రింది వారు దరఖాస్తు చేసుకోలేరు:
ఐఐటీ, ఐఐఎం, ఐఐటీటీ, ఐఐఈఎస్ఆర్ వంటి ఉన్నత విద్యాసంస్థల అభ్యర్థులు
సిఎ, సిఎమ్ఎ, సిఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసినవారు
మాస్టర్ డిగ్రీ కలిగిన వారు
ఇప్పటికే కేంద్ర/రాష్ట్ర శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు
నాప్స్ లేదా నాట్స్ ఇంటర్న్‌షిప్ చేసినవారు
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే
ముఖ్య పత్రాలు (డాక్యుమెంట్లు):
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు
బోనాఫైడ్/చదువు ధృవపత్రం
ఎస్ఎస్సీ/ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్
ఆదాయ ధృవపత్రం
పాస్‌బుక్ ప్రతులు
మొబైల్ నంబర్
పాస్‌పోర్టు సైజ్ ఫోటో
ఎంపిక విధానం:
ఈ పథకంలో ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఎంపికకు ముఖ్యంగా విద్యార్హత మరియు పత్రాల ధృవీకరణ ఆధారం.
ఆన్లైన్ దరఖాస్తు
అర్హత పరిశీలన
సంస్థలతో అనుసంధానం
తుదిజాబితా ప్రకటించడం
ఇంటర్న్‌షిప్ ఆఫర్ లేఖ జారీ
దరఖాస్తు విధానం:
ఈ పథకానికి దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్లో నమోదు కావాలి:
అధికారిక పోర్టల్: https://pminternship.mca.gov.in
దశలవారీగా దరఖాస్తు:
పథకం అధికారిక వెబ్సైట్లో ప్రవేశించాలి
కొత్త అభ్యర్థుల నమోదు (New Registration) పై క్లిక్ చేయాలి
ఆధార్ ధృవీకరణ చేయాలి
వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
విద్యార్హత వివరాలు నమోదు చేయాలి
పత్రాలు జత చేయాలి
చివరిగా దరఖాస్తు సమర్పించాలి
ఈ పథకం ఎవరికీ అత్యంత ఉపయోగకరం?
✓ పట్టభద్రులు అయినా ఉద్యోగం రాకపోయిన యువతకు
✓ వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి
✓ భవిష్యత్తులో మంచి వేతనం కలిగిన ఉద్యోగం ఆశించే వారికి
✓ ఇటీవలి కాలంలో నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న వారికి
