తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Panchayat Elections 2025) హోరాహోరీ రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ (SEC) ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు, 5,749 మండల పరిషత్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (MPTC) స్థానాలు, 656 జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (ZPTC) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
అయితే, కోర్టు కేసుల కారణంగా అన్ని చోట్ల పోలింగ్ జరగదు. 14 ఎంపీటీసీ స్థానాలు, 27 గ్రామ పంచాయతీలు, 246 గ్రామ వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో 25 పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలో 2 పంచాయతీలు ఉన్నాయి.
ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు: “ఎన్నికలు రద్దు కావచ్చు”
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “జీవో చెల్లదు, ఎన్నికలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు డబ్బు ఖర్చు పెట్టి నష్టపోవద్దు” అని హెచ్చరించారు. పలు రాష్ట్రాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికలను రద్దు చేసిన ఉదాహరణలను గుర్తు చేశారు.
కవిత కౌంటర్: “కోర్టులను ప్రభావితం చేయాలని బీజేపీ ప్రయత్నం”
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “బీజేపీ నేతలు కోర్టులను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థ అధికారాలు తమకున్నట్లుగా మాట్లాడుతున్నారు” అని విమర్శించారు. బీజేపీ నేతల తీరును ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ వ్యూహం: బీసీ రిజర్వేషన్ ,సంక్షేమ పథకాలే బలం
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అక్టోబర్ 5 లోపు అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.
జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక – రాష్ట్రస్థాయిలో పీసీసీ అధిష్టానం
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక – డిసిసి స్థాయిలో
ప్రచారంలో ప్రధానంగా ఉచిత బియ్యం పంపిణీ, మహిళలకు RTC ఉచిత ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, బీసీ రిజర్వేషన్లు వంటి సంక్షేమ పథకాలపై దృష్టి సారించనుంది.
అయితే, ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి:
– రైతులకు యూరియా కొరత
– ఎరువుల కోసం పొలంలో వందల మంది రైతులు క్యూలలో నిలబడి ఇబ్బందులు
– గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు
– అమలు కాని ఆరు గ్యారంటీలు
– అమలు కాని రాజీవ్ యువ వికాసం పథకం
ఇవి కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ వ్యూహం: బాకీ కార్డు ఉద్యమం:
ఎన్నికలలో తిరిగి బలం చాటుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ (మాజీ TRS) ప్రజల్లో తిరిగి పునరాగమనం కోసం ప్రయత్నిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “గల్లీ నుంచి దిల్లీ వరకు గెలిచేది బీఆర్ఎస్నే” అని ధీమా వ్యక్తం చేశారు.
రైతులు, యువత, మహిళలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని, ముఖ్యంగా ఎరువుల కొరత, విద్యుత్ సమస్యలు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కుదిపేస్తాయని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ప్రస్తుతం బాకీ కార్డు ఉద్యమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. “టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను బరువు మోసేలా చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది” అంటూ ప్రతిపక్షం కాంగ్రెస్‌పై దాడి చేస్తోంది.
బీజేపీ లక్ష్యం: గ్రామాల నుంచి గల్లీ వరకూ కాషాయ జెండా:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత ఇదే మొదటి ఎన్నికలు కావడంతో ఇది బిజెపికి ప్రతిష్టాత్మక పోరాటం అవుతోంది.
పార్టీ నినాదం – “దిల్లీలోనే కాదు, గల్లీలోనూ కాషాయ జెండా ఎగురుతుంది”.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. నిజాయితీగా పనిచేసిన కేడర్‌కే టికెట్లు ఇస్తామని, పైరవీలకు తావు ఉండదని స్పష్టం చేశారు.
ప్రజల స్పందన: ఎవరి పట్ల విశ్వాసం?
ప్రజలలో మూడు ప్రధాన సమస్యలు ముందుకు వస్తున్నాయి:
• రైతులు – ఎరువుల కొరత, కరెంటు సమస్య, పూర్తి స్థాయిలో అమలు కాని ఆరు గ్యారంటీలు
•యువత – ఉద్యోగ నియామకాలు లేకపోవడం, నియామకాలలో అవకతవకలు
•మహిళలు – సంక్షేమ పథకాల మద్దతు ఉన్నా, అమలు లోపాలు
ఒకవైపు కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై ఆధారపడుతుంటే, మరోవైపు రైతులు, యువతలో వ్యతిరేకత కనిపిస్తోంది.
రాజకీయ విశ్లేషణ
•టికెట్ల పంపిణీ, రిజర్వేషన్లు ప్రధాన సవాలు.
•టికెట్ దక్కని నేతలు రెబెల్ అభ్యర్థులుగా బరిలో దిగే అవకాశం.
•అధికార పార్టీ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశాలు ఉండచ్చు.
•బీఆర్ఎస్ & బీజేపీ రెండూ బలమైన పోటీని ఇస్తున్నాయి.
•హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు •సమయానికి జరుగుతాయా లేదా అనేది ఇంకా అనుమానాస్పదం
Telangana Local Body Elections 2025 గ్రామీణ రాజకీయాలను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో గెలుపు సాధించాలని చూస్తుంటే, బీఆర్ఎస్ తిరిగి పునర్వైభవం కోసం బాకీ కార్డు ఉద్యమం చేస్తోంది. బీజేపీ మాత్రం గ్రామాల నుంచి దిల్లీ వరకు కాషాయ జెండా ఎగురేయాలని సంకల్పించింది.
ఇక ఈటెల రాజేందర్ “ఎన్నికలు రద్దు కావచ్చు” అని హెచ్చరించగా, “కోర్టులను ప్రభావితం చేయాలనే బీజేపీ ప్రయత్నం” అని కవిత కౌంటర్ ఇచ్చారు. ఇది ఎన్నికల వేళ మరింత చర్చనీయాంశమైంది.
ఎన్నికలు సమయానికి జరిగితే ఇది నిజమైన త్రికోణ పోరు (Congress vs BRS vs BJP) అవుతుంది. చివరికి ప్రజలే ఏ పార్టీని గెలిపిస్తారో త్వరలోనే తేలనుంది.
– By Veeramusti Sathish
READ IN ENGLISH
FOR MORE NEWS
Kavitha liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడి షాక్ – ప్రతిపక్షం TV
Kalvakuntla Kavitha:కవిత గాలం వేయాలని చూసింది – ప్రతిపక్షం TV

