యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సుమారు వందేళ్ల చరిత్ర ఉంది,సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్దిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం అన్నింటా పారదర్శకతను పాటిస్తోంది. ఈ విషయంలో మేం యూపీఎస్సీకి అభినందనలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆ విధంగానే రూపొందించాలని తాము నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనికి తెలిపారు.
న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో యూపీఎస్సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శ్రీ శశిరంజన్ కుమార్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పని తీరుపై సుధీర్ఘంగా చర్చించారు.
యూపీఎస్సీ పారదర్శకతను పాటిస్తోందని,అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు,పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.
2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి,దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందన్నారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని, కానీ గత ప్రభుత్వ అసమర్థతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు.
తామ రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్,సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు.టీఎస్పీఎస్సీలో అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వివరించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మన్ టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నందున టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని వారు తెలిపారు.