కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులకు అడ్మిషన్లు.. చివరి తేదీ అక్టోబర్ 13
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం (Centre for Distance and Online Education) ఆధ్వర్యంలో జూలై 2026 అకడమిక్ సెషన్‌కు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అర్హత కలిగిన విద్యార్థుల నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీకి NAAC A+ గ్రేడ్ గుర్తింపు ఉంది. దూర విద్యా విధానంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
డిగ్రీ, పీజీ కోర్సులు ఏవంటే?
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో బీఏ, బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్), బీబీఏ, బీఎస్సీ (M.St.Cs.), బీఎల్ఐఎస్సీ కోర్సులు ఉన్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ వంటి సబ్జెక్టుల్లో ఎంఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇవే కాకుండా ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్), ఎంఏ (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), హెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ, వివిధ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు
డిప్లొమా కోర్సుల్లో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాస్, కంప్యూటర్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ వంటి కోర్సులు ఉన్నాయి.
సర్టిఫికెట్ కోర్సుల్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్ విత్ పైథాన్, ఏఐ టెక్నిక్స్ విత్ పైథాన్, ఎంఎల్ విత్ పైథాన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్, ట్రైబల్ స్టడీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోఇన్ఫర్మాటిక్స్, హ్యూమన్ వాల్యూస్ తదితర కోర్సులు ఉన్నాయి.
అలాగే మిమిక్రీ, సీపీఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్యూటీషియన్, మెహందీ డిజైన్, పెరిని నాట్యం వంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లను కూడా యూనివర్సిటీ ప్రకటించింది.
అడ్మిషన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?
కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ జూలై 1, 2026 నుంచి ప్రారంభమైంది. అడ్మిషన్లకు చివరి తేదీని అక్టోబర్ 13, 2026 వరకు పొడిగించారు.
దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ లేదా ఇతర కోర్సులు చేయాలనుకునే విద్యార్థులు తమకు అనుకూలమైన కోర్సును ఎంచుకుని దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ ఫారం, కోర్సుల వివరాలు, అడ్మిషన్‌కు సంబంధించిన సమాచారం కోసం కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
అధికారిక వెబ్సైట్: www.sdlceku.co.in
యూనివర్సిటీ: కాకతీయ యూనివర్సిటీ, వరంగల్, తెలంగాణ.

