హైదరాబాద్, ప్రతిపక్షం: ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) శుభవార్త తెలిపింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలో ఐదు కోర్సులకు ఆమోదం తెలిపినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
యూజీసీ తాజాగా ఆమోదం తెలిపిన కోర్సుల్లో M.A. Education, M.A. Education (School Administration), Master of Social Work (MSW), M.Sc. Geography కొత్త కోర్సులు ఉండగా, B.Ed. (Special Education) కోర్సుకు అనుమతి పునరుద్ధరణ (Renewal) లభించింది.
ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ఈ కోర్సులకు విద్యా, ఉద్యోగ, వృత్తిపరమైన రంగాల్లో అధిక డిమాండ్ ఉందన్నారు. జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్‌గా యూనివర్సిటీని పరిశీలించి, మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలు, ఇతర సదుపాయాలను సమీక్షించిన అనంతరం ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందని వివరించారు.
ఈ కోర్సుల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వ సహకారం కీలకంగా నిలిచిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, ఐఏఎస్ సూచనల మేరకు ముఖ్యంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పించేలా ఈ కోర్సులను రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రత్యేకంగా M.A. Education, M.A. Education (School Administration), B.Ed. (Special Education) కోర్సులు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. విద్యార్హతలను మెరుగుపరచుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, స్కూల్ అడ్మినిస్ట్రేషన్‌లో నైపుణ్యాలు సాధించడం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కోర్సుల అమలుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖతో త్వరలో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా Master of Social Work (MSW), M.Sc. Geography కోర్సులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న పీజీ ప్రోగ్రాములుగా పేర్కొన్నారు.
ఈ కోర్సులకు సంబంధించిన అర్హతలు, ప్రవేశ విధానం, ఫీజు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో అడ్మిషన్ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని యూనివర్సిటీ ప్రకటించింది.
యూజీసీ ఆమోదించిన కోర్సులు
– M.A. Education
– M.A. Education (School Administration)
– Master of Social Work (MSW)
– M.Sc. Geography
– B.Ed. (Special Education) – అనుమతి పునరుద్ధరణ
విద్యార్థులకు సూచన
ఈ కోర్సులకు సంబంధించిన తాజా సమాచారం, అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
Previous ArticleTelangana: దేవాదాయ శాఖలో 190 EO ఉద్యోగాలు
Veeramusti Sathish
Veeramusti Sathish is an independent journalist and RTI activist, founder of PrathipakshamTV, reporting on governance and people’s rights.
