హైదరాబాద్: ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) శుభవార్త చెప్పింది. యూనివర్సిటీలో నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించేందుకు యూజీసీ అనుమతి ఇచ్చింది. మరో కోర్సుకు అనుమతిని పునరుద్ధరించింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
యూజీసీ అనుమతి ఇచ్చిన కొత్త కోర్సుల్లో M.A. Education, M.A. Education (School Administration), Master of Social Work (MSW), M.Sc. Geography ఉన్నాయి. ఇక B.Ed. (Special Education) కోర్సుకు అనుమతి పునరుద్ధరణ లభించింది.
ఈ కోర్సులకు ప్రస్తుతం విద్యా, ఉద్యోగ రంగాల్లో మంచి డిమాండ్ ఉందని ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. జూన్లో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ విధానంలో BRAOU యూనివర్సిటీని పరిశీలించిందన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలోని మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలు, ఇతర సదుపాయాలను కమిటీ పరిశీలించినట్లు చెప్పారు.
కొత్త కోర్సుల రూపకల్పనలో తెలంగాణ విద్యాశాఖ సహకారం కూడా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, ఐఏఎస్ సూచనల మేరకు ముఖ్యంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా కొన్ని కోర్సులను రూపొందించినట్లు వివరించారు.
ఉపాధ్యాయులకు ఉపయోగకరం
M.A. Education, M.A. Education (School Administration), B.Ed. (Special Education) కోర్సులు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయని BRAOU యూనివర్సిటీ భావిస్తోంది. చదువును కొనసాగించడంతో పాటు స్కూల్ నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాలు, వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ కోర్సుల అమలుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖతో త్వరలో అవగాహన ఒప్పందం (MoU) చేసుకోనున్నట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు.
మరోవైపు Master of Social Work (MSW), M.Sc. Geography కోర్సులకు కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని యూనివర్సిటీ పేర్కొంది. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చదువుకోవాలనుకునే వారికి ఈ కోర్సులు మరో అవకాశం కానున్నాయి.
అడ్మిషన్ల వివరాలు త్వరలో
కొత్త కోర్సులకు సంబంధించి అర్హతలు, ఫీజు, కోర్సు వ్యవధి, అడ్మిషన్ విధానం, స్టడీ సెంటర్ల వివరాలను BRAOU యూనివర్సిటీ త్వరలో విడుదల చేయనుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి ఉండాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
యూజీసీ అనుమతి పొందిన కోర్సులు ఇవే..
- M.A. Education
- M.A. Education (School Administration)
- Master of Social Work (MSW)
- M.Sc. Geography
- B.Ed. (Special Education) – అనుమతి పునరుద్ధరణ
అడ్మిషన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం BRAOU అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు సూచించారు.
READ MORE :
BRAOU:అంబేద్కర్ విశ్వవిద్యాలయం అడ్మిషన్ గడువు పొడిగింపు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూముల కేటాయింపుపై ఆందోళన

