తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
• మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
• నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం.
• ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష.
• యువత భవిత మాకు ప్రాధాన్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి… వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
• రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నాం.
• గత పాలనలో స్తంభించినపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించాం.ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం.
• గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచాం. తర్వలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతి పై కూడా శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం.
• గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టాం.
• ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు పదేళ్లుగా ఎదురు చూశారు. అతి త్వరలో వారి ఆశలు ఫలిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయి.
• అధికారం కోల్పోయిన దుగ్ధ, ఈర్ష్యతో కొందరు అధములు చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలతో గందరగోళపడవద్దు. ఇది గత పాలన కాదు… జన పాలన. ప్రతి పౌరుడు ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి.
• అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుండి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.
• ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
• కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా… కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా… అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తూ…
• ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణలోని ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ… అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.