జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే తమ ప్రభుత్వం చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదని, అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్) హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు.
ప్రజాభిప్రాయం,పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే,వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని చెప్పారు. ఒకప్పుడు రాజాకీయ పార్టీలు తమ సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే మీడియాను ఏర్పాటు చేసుకునేవి, కానీ ఇప్పుడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి అర్ధాన్నే మార్చేస్తున్నారు. ఉన్మాదంతో వ్యవహరించే అలాంటి వారిని నియంత్రించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉంది. జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని, నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇండ్ల స్థలాల విషయంలో మిగతా జర్నలిస్టులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.